class="wp-singular post-template-default single single-post postid-788 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపడం లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి సమతుల ఆహారం, ప్రోటీన్‌ యుక్తమైన భోజనం, క్రమమైన వ్యాయామం మరియు రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. అయితే రాత్రివేళల్లో మొబైల్ ఫోన్లలో ఎక్కువసేపు గడపడం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

ఇటీవల కొందరికి రాత్రి గాఢనిద్రలో ఉండగా ఆకస్మికంగా మేల్కొనే సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి ఒకటి లేదా రెండు గంటలకు మెలకువ రావడం తీవ్రమైన ఒత్తిడికి సంకేతమై ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్ స్థాయులు అసాధారణంగా పెరిగితే రాత్రిపూట హఠాత్తుగా మేల్కొనడం సాధారణమని వైద్యులు వివరిస్తున్నారు.

అర్థరాత్రి సమయంలో మేల్కొన్న తర్వాత మళ్లీ నిద్ర పట్టకపోతే అది అధిక మానసిక ఒత్తిడి సూచనగా భావించవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితి నాడీ వ్యవస్థలో అసమతౌల్యాన్ని సూచించవచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రాత్రివేళ శరీరం పారాసింపథెటిక్ స్థితిలోకి వెళ్లి విశ్రాంతి పొందాలి. అయితే ఒత్తిడి అధికమైతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది. నిద్ర సమస్యలు కొనసాగితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.